Satya Kumar Comments: 'ప్రజల మధ్యకి రావడానికి జగన్ భయపడుతున్నారు' - తెనాలి వార్తలు
BJP National Secretary Satya Kumar Comments on Jagan: జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మండిపడ్డారు. హత్యలు, దోపిడీలు, మాదకద్రవ్యాలతో రాష్ట్రంలో మారణ హోమంగా సృష్టిస్తున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 9 ఏళ్ల పాలనలో బీజేపీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు.
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించ లేని ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే చెందుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలిస్తే.. దుకాణాలకు కూడా జగనన్న షాప్ అని పేరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మండిపడ్డారు. రాష్ట్రానికి రాజధాని లేదని ప్రశ్నిస్తే ప్రభుత్వానికి ఎందుకు కోపం వస్తుందో తమకు అర్థం కాలేదని అన్నారు.
ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నప్పటికీ ప్రధాని మోదీ ప్రజల మధ్య తిరుగుతుంటే.. జగన్ మాత్రం పరదాలు, బారికేడ్ల మధ్య తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేశానని చెప్పుకునేటప్పుడు వాళ్ల మధ్య తిరగడానికి భయం ఎందుకు అన్నారు. కేంద్రం ఇస్తున్న పథకాలకు కూడా జగన్ పేర్లు పెట్టుకోవడాన్ని తప్పుబట్టారు. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కలిసి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సత్యకుమార్ కోరారు.