GVL comments on party alliances: 'పవన్ ఆలోచనను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాం.. త్వరలోనే స్పష్టత' - tdp news
GVL Comments on pawan kalyan alliance comments: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాజాగా పార్టీ పొత్తులపై మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు కచ్చితంగా పొత్తు పెట్టుకుంటాయని ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించటమే లక్ష్యంగా.. జనసేన-టీడీపీ-బీజేపీల కూటమి ముందుకెళ్తుందన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్న జగన్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాల్సిందేనంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పార్టీ పొత్తుల వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు కలిసి పోటీ చేయాలన్న పవన్ కల్యాణ్ ప్రతిపాదనలపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టతనిచ్చారు. ప్రస్తుతానికి జనసేన, భారతీయ జనతా పార్టీలు పొత్తులోనే ఉన్నాయన్నారు. మూడో పార్టీతో కలవడం అనే అంశాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లామని.. త్వరలోనే అంతిమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. అనంతరం కర్ణాటకలో నిన్న వెలువడినా ఎన్నికల ఫలితాల్లో బీజేపీకీ సీట్ల సంఖ్య తగ్గినా.. ఓట్ల శాతం తగ్గలేదన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల మీద ఎటువంటి ప్రభావం చూపవని జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు.
విశాఖపట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ..''కర్ణాటక ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేసుకుంటాం. జేడీఎస్ ఓట్లు కాంగ్రెస్‌కి బదిలీ అయ్యాయి. అందుకే ఆ పార్టీకి అన్ని స్థానాలు వచ్చాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై అసలు ప్రభావం చూపవు. ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు.. మరొక రాష్ట్రం పై చూపించవు. ఏపీలో అరాచక ప్రభుత్వ నడుస్తోంది. జగన్ సర్కార్‌పై ఛార్జ్‌షీట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పోలీసు అధికారి కాళ్ల మధ్య బీజేపీ నేతలను, కార్యకర్తలను అణిచివేయడం దారుణం. మేము జనసేనతో పొత్తులోనే ఉన్నాము. వైసీపీ వ్యతిరేక ఓటును చిలకుండా చూస్తాం'' అని ఆయన అన్నారు.