BJP Leaders Dharna Against TTD Decision: టీటీడీ స్థలం కుల సంఘానికి కేటాయించడంపై బీజేపీ ఆగ్రహం.. ధర్నా - తిరుమల వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 4, 2023, 5:52 PM IST
BJP Leaders Dharna Against TTD Decision: ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకంటూ బీజేపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తిరుపతిలో తితిదే పరిపాలనా భవనం ముందు బైఠాయించి బీజేపీ(BJP) నేతలు ధర్నా నిర్వహించారు. వేంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన వందల కోట్ల రూపాయల స్ధలాన్ని కుల సంఘాలకు కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పదవి కాలం ముగిసిన తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన చివరి సమావేశంలో తిరుపతిలోని ఇస్కాన్ రహదారిలో ఉన్న తితిదే(TTD) స్ధలాన్ని ఓ సంఘానికి కేటాయిస్తూ తీర్మానం చేశారని బీజేపీ నేత నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తితిదే ధర్మకర్తల మండలిలో తీసుకుంటున్న నిర్ణయాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. తితిదే ధర్మకర్తల మండలిలో తీసుకుంటున్న నిర్ణయాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా తితిదే పాలన యంత్రాంగం ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో స్వామివారి సేవలకు సంబంధించిన వివరాలను వెబ్సైట్లో పెట్టేవారని.. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం తితిదేకు సంబంధించిన జీవోలను రహస్యంగా ఉంచుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన ఓ కులసంఘానికి భూములను కేటాయించేందుకు తితిదే చర్యలు చేపడుతున్నట్లు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుల సంఘాలకు కేటాయించి ఉంటే ఆ భూములను వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే తమ ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు.