BJP Leaders Meet Governor: కావలి డీఎస్పీని సస్పెండ్ చేయాలి.. గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు - కావలి ఘటపై బీజేపీ రియాక్షన్
BJP Leaders Meet Governor: ఇటీవల నెల్లూరు జిల్లా కావలిలో సీఎం పర్యటన సందర్భంగా బీజేపీ నాయకుడిపై డీఎస్పీ అత్యంత కర్కశంగా వ్యవహరించడంపై... గవర్నర్ నజీర్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. కావలి డీఎస్‌పీపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఘటనపై జాతీయ బీసీ కమిషన్‌కు, మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు వీర్రాజు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం బీసీల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తోందని సోము మండిపడ్డారు. సీఎం జగన్‌కు బీసీలంటే చిన్నచూపు అని సోము వీర్రాజు ఆరోపించారు.
బీసీలపై దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 28న విశాఖలో, వచ్చే నెల 16, 17న కర్నూలులో బీసీ సదస్సును నిర్వహించనున్నట్లు వీర్రాజు వెల్లడించారు. కావలిలో జరుగుతున్న అక్రమాలపై సీఎంను కలిసేందుకు సురేశ్ ప్రయత్నీస్తే అతనిపై పోలీసులు దాడి చేశారని సోము ఆరోపించారు. బీసీలపై జరుగుతున్న దౌర్జన్యాల మీద త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేయనున్నట్లు సోము వీర్రాజు వెల్లడిచారు. 50 శాతం జనాభా ఉన్న బీసీల్లో సామాజిక చైతన్యం తీసుకువస్తామని ఆయన వెల్లడించారు.