కరవు సాయంపై కేంద్రానికి లేఖ రాయని జగన్ - రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం : బీజేపీ - బీజేపీ కామెంట్స్ ఆన్ వైసీపీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 19, 2023, 4:32 PM IST
BJP Leader Satya Kumar Comments on YS Jagan Govt: రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తూ... రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సాయం అందించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా విఫలమయ్యారని బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్య కుమార్ విమర్శించారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్వర్తి ఫిడేలు వాయించినట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారని సత్య కుమార్ ఆరోపించారు. తాడేపల్లి భవనానికి పరిమితమైన సీఎం అబద్దాలు, మాయమాటలు చెబుతూ కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు లేవని, ఏదో కొద్దిగా ఉందని సీఎం అబద్దాలు చెబుతున్నారని, కనీసం సమీక్ష చేయలేదన్నారు. తీవ్రంగా కరవున్నా రాష్ట్రం కేవలం 103 మండలాల్లో మాత్రమే కరవుందని చెప్పడం దారుణమన్నారు. కరవు వల్ల రాష్ట్రంలో 80 శాతం నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 10 శాతం మాత్రమే నష్టాన్ని చూపిస్తున్నారని, కరవు సాయం కోసం కేంద్రానికి సీఎం జగన్ కనీసం లేఖ రాయలేదని సత్యకుమార్ పేర్కొన్నారు.
పంటలు ఎండుతున్నా వ్యవసాయం కోసం రైతులకు నీరివ్వని సీఎం జగన్... తన సొంత కంపెనీలకు మాత్రం జీవోలు ఇచ్చి నిరంతరాయంగా నీరుస్తున్నారని సత్యకుమార్ విమర్శించారు. సొంత జిల్లాలో చుట్టూ కరవున్నా భారతి సిమెంట్స్ కు 0.1 టీఎంసీ నీటిని నిరాటంకంగా తరలిస్తున్నారని ఆరోపించారు. సీఎం మేనమామ సంస్థ ప్రతిభ బయోటెక్స్ కు సైతం రోజుకు 500 కెఎల్డీ చొప్పున నీరు ఇస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ తీవ్ర నిర్లక్ష్యం చేసిందని సత్యకుమార్ ఆరోపించారు. కేంద్రం నిధులిస్తున్నా పోలవరాన్ని పట్టించుకోలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు కట్టారో, నిధులిచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి వ్యవసాయ మంత్రి ఎవరంటే రైతులకు తెలియని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. వైసీపీ చేసే తప్పులను ప్రశ్నిస్తే గత ప్రభుత్వంపై ఆరోపనలు చేయడం, తిట్టడమే వ్యవసాయ మంత్రి, వైసీపీ నేతలకు తెలుసని విమర్శించారు. కరవు పరిస్థితులపై బీజేపీ కార్యాచరణ రూపొందించి పోరాటం చేస్తుందని సత్యకుమార్ పేర్కొన్నారు.