తిరుమలను వైసీపీ ఆదాయ వనరుగా చూస్తోంది - ₹400కోట్లకు పైగా నిధులు పక్కదారి : లంకా దినకర్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 27, 2023, 4:38 PM IST
BJP Leader Lanka Dinakar Comments on YCP Govt: రాష్ట ప్రభుత్వం తిరుమలను ఆదాయ వనరుగా చూస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ (Lanka Dinakar) ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, టీడీపీ సంస్థలకు సేవ చేసే బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానానిదేనని ఆయన తెలిపారు. అన్ని నగరాల తరహాలోనే తిరుపతికి నగర పాలక సంస్థ ఉందని.. తిరుపతి ప్రజలకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థపై ఉందన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాల్లో టీటీడీ నిధులు పెద్ద మొత్తంలో పక్కదారి పట్టించారని దినకర్ మండిపడ్డారు.
తితిదే నిధులను దారి మళ్లించడం ద్వారా నగరపాలక సంస్థను టీటీడీలో విలీనం చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోందన్నారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ఇచ్చే నిధులు, పన్నులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. తిరుపతి అభివృద్ది కోసం కేంద్రం 500 కోట్ల రూపాయలు విడుదల చేస్తే.. కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను సరిగ్గా ఖర్చు పెట్టకుండా టీటీడీ నిధులను ఎందుకు మళ్లిస్తున్నారని దినకర్ ప్రశ్నించారు.