Bhanu Prakash Reddy: 'టీటీడీ ఆస్తులను విక్రయించే హక్కు ధర్మకర్తల మండలికి ఎవరిచ్చారు' - Padmavati Nilayam rent is 21 lakh rupees
తిరుమలు తిరుపతి దేవస్థానంను (టీటీడీ) అధికారులు వ్యాపార సంస్ధగా మార్చి వేస్తున్నారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీటీడీ అధికారుల తీరును ఆయన తప్పు బట్టారు. పద్మావతి నిలయాన్ని కలెక్టర్ కార్యాలయానికి కేటాయించి ఏడాది గడుస్తున్నా అద్దె వసూలు చేయడం లేదని ఆయన విమర్శించారు. నెలకు 21 లక్షల రూపాయల చొప్పున దాదాపు 2.5 కోట్ల రూపాయలు అద్దె బకాయి ఉందని అన్నారు. అద్దె చెల్లించని ప్రభుత్వానికి నోటీసు ఇవ్వకుండా బకాయి వసూళ్లకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అద్దె వసూళ్లను పట్టించుకోని టీటీడీ అధికారులు 100 కోట్ల రూపాయలకు భవనాన్ని కొనుగోలు చేయాలంటూ ప్రభుత్వానికి లేఖ రాశారని విమర్శించారు. టీటీడీ ఆస్తులను విక్రయించే హక్కు ధర్మకర్తల మండలి, అధికారులకు ఎవరిచ్చారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. అద్దె వసూళ్లు, ప్రభుత్వానికి పద్మావతి నిలయాన్ని విక్రయించాలన్న నిర్ణయంపై అధికారులు స్పందించాలని భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.