రాష్ట్రంలోని ప్రతి పథకంలో అవినీతి రాజ్యమేలుతోంది: పురందేశ్వరి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 3, 2024, 4:41 PM IST
BJP is Behind Every Scheme Implemented in The State :రాష్ట్రంలో ప్రతి పథకం వెనక స్కాం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన మేలు వివరించే బాధ్యత పదాధికారులదే అని పేర్కొన్నారు. రైతు పార్టీ అని చెప్పుకునే వైసీపీ వారికి ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని నమ్మబలికి, ఇప్పుడు చెల్లించకుండా రైతులను మోసం చేశారని వ్యాఖ్యానించారు.
మహిళ సాధికారత, ఆర్ధిక వృష్టికి నరేంద్ర మోదీ కృషి చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నారని పురందేశ్వరి ఉద్ఘాటించారు. విశాఖలో యువతిపై సామూహిక అత్యాచారం జరగడం దారుణమని పేర్కొన్నారు. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వంగా గొప్పలు చెప్పుకుంటున్న జగన్, అది పని చేస్తుంటే బాలికపై అత్యాచారం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు రాలేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన అనంతరం 5 లక్షల ఉద్యోగాలిస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి పథకంలో అవినీతి రాజ్యం ఏలుతుందని దుయ్యబట్టారు. అధికార నాయకులు ప్రతి పథకంలో వాటా ఉండేలా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.