BJP expresses anger on MP Vijayasai Reddy comments పురందేశ్వరీపై విజయసాయిరెడ్డి మాట్లాడిన తీరును ఖండించిన బీజేపీ - ఏపీ మద్యం కుంబకోణం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 28, 2023, 9:12 PM IST
BJP expresses anger over MP Vijayasai Reddy comments: రాష్ట్రంలో మద్యం కుంభకోణం మంటలు చల్లారడం లేదు. గత కొంత కాలంగా ఇదే అంశంపై వైసీపీ, బీజేపీ మధ్య... మాటల యుద్దం కొనసాగుతోంది. మద్యం వ్యాపారంలో జరుగుతున్న అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఆధ్యక్షురాలు పురందేశ్వరి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. మద్యం దుకాణాలు మెుదలు... సరఫరా చేసే గోదాంలకు వెళ్లి మరి తనిఖీలు నిర్వహిస్తూ అక్రమాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అవలంభిస్తున్న మద్యం విధానాలపై పురందేశ్వరి చేస్తున్న ఆరోపణలపై ప్రజల్లో సైతం చర్చ జరుగుతున్న సందర్భంగా ప్రభుత్వ పెద్దలు దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. పురందేశ్వరి చేస్తున్న ఆరోపణలపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.
పురందేశ్వరి చేసిన ఆరోపణలు అర్థరహితమని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. అక్రమాలపై ఆధారాలు ఉంటే నిరూపించాలని... పరుష పదజాలంతో సవాల్ విసిరారు. పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి మాట్లాడిన తీరును బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. విజయసాయిరెడ్డి, పురందేశ్వరికి బహిరంగ క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.