Sujana Chowdary fire on YSRCP: 'జగన్ ప్రభుత్వ అసమర్థత వల్లే.. పోలవరం, రాజధాని నిర్మాణాలు పూర్తి కాలేదు' - polavaram project news
Sujana Chaudhary Fire on YSRCP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసమర్థత వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదని.. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఆరోపించారు. అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటును అందించినప్పటికీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలన పూర్తైన సందర్భంగా ఈరోజు విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుతో కలిసి సుజనా చౌదరి మోదీ 9 ఏళ్ల పాలనపై కరపత్రాలను విడుదల చేశారు.
కేంద్రం ఇప్పటికీ కట్టుబడే ఉంది.. మీడియాతో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ.. ''రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత మూలాన ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం నుంచి పూర్తి సహాయం, సహకారం జరగటం లేదు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మోదీ ప్రభుత్వం రాగానే ఏడు మండలాలను ఇక్కడికి మార్చింది. పోలవరం ప్రాజెక్ట్‌ను నేషనల్ ప్రాజెక్ట్ కింది డిక్లర్ చేసి, దానికి కావాల్సివన్నీ ఇచ్చింది. కానీ, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం-ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వాల విఫలం మూలంగా అది పూర్తి కాలేదు కానీ.. ఇందులో కేంద్ర ప్రభుత్వ సమస్య ఏమీ లేదు. ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం కోసం కట్టుబడి ఉంది. రాజధాని అమరావతి విషయంలో కూడా కేంద్రం అన్ని రకాల పర్మిషన్లు, డబ్బులు, అవుటర్ రింగ్ రోడ్లు కూడా మంజూరు చేసింది. కానీ, దురదృష్టవశాత్తు గత నాలుగేళ్లుగా ఈ రాష్ట్రానికి రాజధానే లేకుండా పోయింది. దానికి కారణం ఈ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే'' అని ఆయన అన్నారు.
ఈ నెల 20 నుంచి కరపత్రాల అందజేత.. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ ప్రతి ఇంటికి మోదీ 9 ఏళ్ల పాలన కరపత్రాలను అందజేస్తామని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. సుమారు 50 లక్షల కరపత్రాలను ముద్రించి.. 50 లక్షల గృహాలకు అందజేసే ప్రయత్నం చేస్తామని ఆయన తెలియజేశారు.