బోర్డులు మార్చండి లేదంటే కేంద్రం నిధులు ఇచ్చేయండి: కేంద్రమంత్రి భారతిపవార్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 7, 2024, 1:39 PM IST
Bharati Pawar Fires on State Government: కేంద్ర నిధులతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి వైఎస్‌ఆర్ ఆరోగ్య బోర్డు ఉండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతిపవార్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని తొర్రగుంటపాలెంలో 80లక్షల రూపాయలతో నిర్మించిన భవనానికి కేంద్ర ప్రభుత్వం బోర్డు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది రోజుల్లో బోర్డులు మార్చకపోతే కేంద్రం ఇచ్చిన నిధులు తిరిగిచ్చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. శనివారం వికసిత భారత్ సంకల్ప యాత్ర సభా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తొర్రగుంటపాలెంలోని వైద్యశాలను సందర్శించారు. అనంతరం బీజేపీ నాయకుల అభ్యర్ధన మేరకు లోపలికి వచ్చారు.
కేంద్ర ప్రభుత్వ వికసిత భారతికి సంబంధించిన ఒక్క బోర్డు లేకపోవడంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ అందేలా చేయడం కోసం ప్రధాని వికసిత భారత్ సంకల్ప యాత్రను నిర్వహిస్తుంది. ఆరోగ్య కేంద్రంలోని రికార్డుల్లో గత నెల 26 తర్వాత ఎటువంటి సమాచారం లేకపోవడంతో అసలు సేవలు అందుతున్నాయా అని ఆమె అధికారులను ప్రశ్నించారు. నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇతర పేర్లతో ఏమీ అమలు అవుతున్నాయో తనకు తెలియజేయాలని ఆమె స్థానిక బీజేపీ నాయకులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఏమాత్రం పాటించని వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.