Bandaru allegations On Rushikonda Lease: 'కుళాయి రూ.6లక్షలు, బాత్రూం ఖర్చు కోటి.. పేద ముఖ్యమంత్రి కోసం విలాసవంతమైన భవనం' - ఏపీ టీడీపీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 14, 2023, 5:29 PM IST
Bandaru Satyanarayana allegations On Rushikonda Lease: పేద ముఖ్యమంత్రి కోసం, ఋషికొండలో విలాసమంతమైన భవనం నిర్మిస్తున్నారని... టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆరోపించారు. ముఖ్యమంత్రి ఒక బాత్రూంకి కోటి రూపాయలు ఖర్చు పెడుతుంటే ఆయన పేదవాడా.. అంటూ ప్రశ్నించారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఋషికొండ పై నిర్మాణాల ఇంటీరియర్ డిజైన్ కోసం 40 నుంచి 50 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ఎవరి సొమ్ము ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. విశాఖలో ఆక్రమించుకున్న 40 వేల ఎకరాలు, వ్యాపారం కోసం ఇక్కడికి వస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల అనంతరం ఈ విలాసవంతమైన, ఈ భవనాన్ని దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా... అంటూ బండారు ఎద్దేవా చేశారు. అసలు ఈ భవనాలను లీజుకి ఇచ్చారా లేదా అనే విషయాన్ని బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. టూరిజం భవనాలు.. ప్రభుత్వ కార్యాలయానికి, నివాసాలకు వినియోగించడం కుదరదని బండారు పేర్కొన్నారు.
మరో టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... పేదవాడైన జగన్మోహన్ రెడ్డి, విలాసవంతమైన సౌకర్యాల కోసం ఋషికొండలో కోట్లు ఖర్చు చేస్తున్నాడన్నారు. ఋషికొండ మీద నిర్మాణాలపై విజిలెన్స్ ఎంక్వయిరీ వెయ్యాలని పల్లా డిమాండ్ చేశారు. డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో దీన్ని లీజుకు ఇచ్చారా లేదా అనే విషయాన్ని చెప్పాలని కోరారు. సీఎం జగన్ తన కేసులు వాదించడానికి లాయర్లకు రూ. 100 కోట్లు వెచ్చించారని ఆరోపించారు.