వైసీపీ వస్తుందని నా కుమారుడికి నమ్మకం ! అంతే అభిమానం జగన్కు కూడా ఉండాలిగా: బాలినేని వివాదాస్పద వ్యాఖ్యలు - తన కుమారుడిపై బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 9, 2023, 10:48 PM IST
|Updated : Dec 10, 2023, 6:37 AM IST
Balineni Srinivasa Reddy Sensational Comments: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు ప్రణిత్ రెడ్డికి సీఎం జగన్ అంటే పిచ్చి అని వ్యాఖ్యనించారు. ఆయన చేసిన పలు వాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే, ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తోందని, తన కుమారుడి నమ్మకం ఉండేదని అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో బాలినేని పాల్గొన్నారు. తెలంగాణలో పర్యటించిన తన కుమారుడు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తోందని అన్నాడని వివరించారు. కానీ, తాను మాత్రం కాంగ్రెస్కు 50 సీట్లు వస్తాయని 50 లక్షలు పందెం కాశానని వివరించారు. నా కుమారుడు బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని, పందెం ఎందుకు పెట్టావని తనను అడిగనట్లు తెలిపారు. తన కుమారుడికి జగన్పై ఉన్న అభిమానం అలాంటిందని వివరించారు.
ఈ క్రమంలో తన కుమారుడి కోసం పందెం నుంచి విరమించుకున్నట్లు ప్రకటించారు. జగన్కు కూడా తమపై ప్రేమ ఉండాలి కదా అని అన్నారు. కార్యకర్తలు, నేతల కోసం పనిచేశానని, వారు నాకోసం పనిచేస్తానని అంటేనే రాబోయే ఎన్నికల్లో పోటి చేస్తానని బాలినేని ప్రకటించారు. వారి మద్దతు లేకపోతే ఎన్నికల బరిలోకి దిగనని స్పష్టం చేశారు. తాను గిద్దలూరు పోతున్నానని, పార్టీ మారుతున్నాననే ప్రచారం చేస్తున్నారన్నారు. తాను మాత్రం ఒంగోలు నుంచే పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే ఇరిటేషన్ వస్తోందని, లేనివి కూడా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆయన కుమారుడిపై ఈ విధమైన ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.