రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలు జరుగుతున్నా నేను మాత్రమే సిట్ వేయించా: బాలినేని
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 21, 2023, 11:20 AM IST
Balineni Srinivasa Reddy Comments on Land Grabbing in Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలులో నకిలీ స్టాంపులు, రిజిస్టేషన్లతో భూ కబ్జాలకు పాల్పడుతున్న సంఘటనలపై తాను మాత్రమే స్పందించి.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయించానని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులో ఆయన నివాసంలో విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా చాలా కాలం నుంచి ఈ భూ కుంభకోణాలు జరుగుతున్నాయని, అయినా తాను మాత్రమే సిట్ ద్వారా దర్యాప్తు చేయిస్తున్నానని అన్నారు.
Land Kabza in Ongole: సిట్ వేసాక అనేక మంది బాధితులు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారంటే కారణం తాను ఈ వ్యవహారంలో కఠినంగా ఉండబట్టేనని అన్నారు. పోలీస్ దర్యాప్తు సాగుతున్న నేపథ్యంలో సుమారు 200 మంది వరకూ ఒంగోలు విడిచి పారిపోయారని, తప్పుచేసినట్లు రుజువయితే వారందరిపైనా చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. తనపై కొంతమంది లేని పోని కథనాలు ప్రచారం చేస్తున్నారని.. ఏదైనా నిజం వెనుక తానుంటానని బాలినేని అన్నారు. ఈ వ్యవహారంలో తాను జోక్యం చేసుకోబోనన్న బాలినేని.. భవిష్యత్తులో ఇంకెవరూ భూ కబ్జాలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి తెలిపానని చెప్పారు.