విద్యార్థులు ప్రతిరోజు వ్యాయమం చేయాలంటున్న బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు - విట్ యూనివర్శిటి
PV SINDHU : భారత ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రాజధాని అమరావతి విట్ యూనివర్శిటీలో సందడి చేశారు. విట్ యూనివర్శిటీ వార్షికోత్సావానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె.. యూనివర్శిటి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. యువత విజయం సాధించాలంటే ముందుగా, శారీరక శ్రమ అవసరమని చెప్పారు. ప్రతిరోజు విద్యార్థులు ఏదో రూపంలో వ్యాయం చేయడంతో వారిలో విజయకాంక్ష పెరుగుతుందని పేర్కొన్నారు. రాజధానికి ఎన్నోసార్లు వచ్చిన తనకు విట్కు రావటం ఇదే తొలిసారని ఆమె తెలిపారు. యూనివర్శిటీ స్థాయి విద్యార్థులకు విద్య మాత్రమే కాదు, క్రీడలూ ముఖ్యమనేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో యూనివర్శిటీలో నిర్వహించిన క్రీడలలో విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఆమె బహుమతులు అందించారు. క్రీడల వల్ల శరీరానికి, మనస్సుకు ఉత్తేజం, ప్రశాంతత లభిస్తుందని సూచించారు. విద్యార్థులకు మానసిక ప్రశాంతత ముఖ్యమని.. దీనివల్ల చదువులపై ఏకాగ్రత పెరుగుతుందని వెల్లడించారు. క్రీడలలోగానీ, ఎదైనా రంగంలోగానీ ఎదగాలంటే మార్గనిర్దేశనం అవసరమని సింధు పేర్కొన్నారు. కచ్చితమైన మార్గంలో వెళితే విజయం సాధించవచ్చని తెలిపారు. త్వరలో అల్ ఇంగ్లాండ్, స్పెయిన్లో నిర్వహించనున్న టోర్నీలలో తాను పాల్గొననున్నట్లు తెలిపారు. విజయం సాధించాలంటే సాధన ముఖ్యమని.. ఎంత ప్రాక్టీస్ చేస్తే విజయానికి అంత చేరువలో ఉంటామని సూచించారు.