రైవస్ కాలువపై ప్రయాణం దినదిన గండం - భయం భయంగా వాహనదారుల రాకపోకలు - కుందేరు వంతెన పనులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 23, 2023, 7:49 PM IST
Bad Roads under YCP Rule : వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో రోడ్లు, బ్రిడ్జిల పరిస్థితి అధ్వానంగా తయారైంది. గజానికో గుంత.. అడుగుకో గొయ్యి అంటూ ప్రతిపక్ష నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల టీడీపీ-జనసేన నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడం విదితమే. పొరుగు రాష్ట్రాల నాయకులు సైతం.. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై జోకులు వేస్తున్నా సీఎం జగన్కు పట్టడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో వైసీపీ ప్రభుత్వంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజక వర్గం కంకిపాడు మండలం కుదేరు వద్ద రైవస్ కాలువపై ప్రయాణం దినదినగండంలా మారిందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాణంలోని వంతెన పూర్తి చేసేందుకు శ్రద్ధ చూపరు.. వినియోగంలోని వంతెన నానాటికీ శిధిలమై ప్రాణాలమీదకు తీసుకొస్తున్నా పట్టించుకోరు.. ఇనుప వంతెనపై రేకులు పైకి లేచివస్తున్నా... తాత్కాలికంగా వెల్డింగ్‌తో టాకాలు వేసి కాలం వెల్లదీస్తున్నారు.. రహదారులు, భవనాలశాఖ అధికారులు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజక వర్గం కంకిపాడు మండలం కుదేరు వద్ద రైవస్ కాలువపై ఉన్న వంతెన వల్ల మచిలీపట్నం రోడ్డు నుంచి గుడివాడ రోడ్డు వైపు వెళ్లే వాహనాలు కంకిపాడు పోకుండా... గుడివాడ నుంచి ఉయ్యూరు వైపు వెళ్లే వాహనాలు కంకిపాడు రాకుండా ఈ దారిలో త్వరగా వెళ్లొచ్చు. కానీ అధికారుల, నాయకుల చిత్తశుద్ధి లోపంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. కుందేరు వంతెన పనులు అంతేనా అని ప్రశ్నిస్తున్నారు.