Damaged Roads in Araku: "అరకు అభివృద్ధిని గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం" రోడ్లపై నాట్లు వేసి బీజేపీ నిరసన - రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లు
Damaged Roads in Araku: వైసీపీ పాలనలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని.. మాజీ ఎంపీ కొత్తపల్లి గీత విమర్శించారు. అరకులో గుంతలు పడ్డ రోడ్లపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. అరకులో రహదారుల అభివద్ధిని పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన సబ్‌ప్లాన్ నిధులను ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై వైసీపీ సర్కారు దృష్టి సారించడం లేదన్నారు. గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులు నిత్యం తిరిగే రహదారి మార్గమే అధ్వానంగా ఉంటే మిగిలిన రహదారుల పరిస్థితి ఎలా ఉంటుందని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో దౌర్భాగ్య పాలన సాగుతుందన్నారు. గుంతలు పడ్డ రహదారులను తక్షణమే మరమ్మత్తులు జరిపి ప్రజల ఇబ్బందులను తీర్చాలని ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాంగి రాజారావు, ఆనంద్, రామచందర్, తదితరులు పాల్గొన్నారు.