ఆయేషామీరా హత్య కేసు దర్యాప్తు పురోగతిపై సీబీఐని ఆదేశించిన హైకోర్టు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 10:40 AM IST
Ayesha Murder Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్య కేసు దర్యాప్తు పురోగతిపై నివేదిక సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. హత్యకేసు విచారణ నిమిత్తం తమ ముందు హాజరుకావాలంటూ విశాఖలోని సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ నిర్దోషిగా బయటపడ్డ పిడతల సత్యంబాబు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ కోర్టులో వాదనలు వినిపించారు.
CBI Submit To Investigation Report In High Court: సీబీఐకి దర్యాప్తును అప్పగించి ఐదేళ్లు పూర్తయిందని మళ్లీ ఇప్పుడెందుకు సత్యంబాబుకు నోటీసు జారీ చేయాల్సి వచ్చిందో చెప్పాలని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అలాగే హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయం, విశాఖలోని సీబీఐ అదనపు ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలంటూ విచారణను మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి ఎన్.జయసూర్య ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.