Awaaz committee dharna: దుల్హన్ పథకంపై కొర్రీలు సరికాదు.. కలెక్టరేట్ వద్ద ధర్నా - Kurnool News
Dharna at Kurnool Collector office: ముస్లిం మైనార్టీల సమస్యలు పరిష్కరించాలని ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. దుల్హన్ పథకాన్ని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మైనారిటీలు విద్యలో వెనుకబడి ఉంటారని.. అలాంటివారికి పదో తరగతి పాస్ అయితేనే దుల్హన్ పథకం వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు పెట్టడం సరికాదని అన్నారు. వక్ఫ్ బోర్డు భూములను పరిరక్షించి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ముస్లిం మైనార్టీలకే ఖర్చు పెట్టాలని వారు ఈ సందర్భంగా కోరారు.
ఎన్నికల ముందు జగన్ రాష్ట్రంలో తిరుగుతూ.. ముస్లిం మైనార్టీల సమస్యలు పరిష్కరిస్తానని వాగ్ధానం చేశారు.. పేదింటి అమ్మాయికి పెళ్లి అయితే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ అందులో అనేక రకాల తిరకాసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారు ఎవరైతే ఉన్నారో.. చిన్న వ్యాపారస్తులు, చిన్న వృత్తులు చేసుకునే వారికి వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పడం జరిగింది.. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసకారి మాటల వల్ల ముస్లిం సమాజం విసిగిపోయిందని అన్నారు.