కాకినాడలో దారుణం.. చేతబడి చేశాడంటూ సోదరుడి పైనే.. - Attack on an man doing black magic in Kakinada
కాలం మారుతోంది.. టెక్నాలజీ పరంగా ఎంతో దూసుకుపోతున్నాం.. అయినా కొంతమంది తీరు మారడం లేదు. అందులో చదువుకున్న వాళ్లు సైతం ఉన్నారు. పాత పద్ధతులను అనుసరిస్తూ మొరటుగా జీవిస్తున్నారు. మూఢ నమ్మకాల పేరుతో క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి ఘటన కాకినాడలో జరిగింది. వృద్ధుడిపై ఆయన సోదరుడే విచక్షణారహితంగా దాడి చేశాడు. చేతబడి చేస్తున్నాడంటూ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
నీలాద్రిరావుపేట వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉండే చిన్న బాబురావుపై ఆయన సోదరుడు శ్రీనివాసరావు, మరికొందరు బంధువులు ఈ నెల రెండో తేదీన దాడి చేశారు. చెప్పులు, కర్రలతో కొట్టారు. కటింగ్ ప్లేయర్తో పళ్లు పీకేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న కొంతమంది ఈ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఘటన జరిగిన రోజే గండేపల్లి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన శ్రీనివాసరావుతోపాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యంత దారుణంగా హింసించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆర్ఎమ్పీగా పనిచేసిన చిన్నబాబురావు అనారోగ్యంతో ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నారు.