Asha Workers Protest in Rain: సమస్యలపై ఆశావర్కర్ల పోరుబాట.. వర్షంలోనూ ఆగని నిరసన - ఆశా వర్కర్లపై పనిభారాన్ని తగ్గించాలని నిరసన
Protest to Reduce Workload on Asha workers : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జోరు వర్షంలోనూ ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా సుందరయ్య భవనం నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఒక వైపు వర్షం కురుస్తుండటంతో వెనకడుగు వేయకుండా ముందుకు సాగిపోయారు. ఒక చేత గొడుగు.. మరో చేత జెండా చేత పెట్టి నిరసన తెలిపారు. ఆశా వర్కర్లపై పని ఒత్తిడి పెరిగిందని.. ఏఎన్ఎం చేయాల్సిన పనిని కూడా తమతో చేయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి పూట విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేస్తున్నారని వాపోయారు. తమకు ఇచ్చిన సెల్ ఫోన్ను సక్రమంగా పని చేయడం లేదని.. తాము చేయాల్సిన పనులకు అంతరాయం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 14 రకాల యాప్లు ఇన్స్టాల్ చేయమని చెబుతున్నారు. రోజు రోజుకు పని పెరుగుతుండటంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులు, ప్రభుత్వం చొరవ చూపాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు.