ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆశావర్కర్ల ఆందోళన - NTR District News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 3:46 PM IST
Asha Workers Protest in Penuganchiprolu PHC of NTR District :ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం పెనుగంచిప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. పెనుగంచిప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తమకు, తాము తీసుకొచ్చిన గర్భిణీలకు ఎటువంటి కనీస సౌకర్యాలు ఉండటం లేదని.. మండలానికి చెందిన ఆశావర్కర్లు ఆందోళన నిర్వహించారు. ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించడం లేదని ఆవేదన చెందుతున్నారు. రోగులకు కనీసం తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేదని వాపోయారు. ఆరోగ్య కేంద్రంలో సమావేశాలు నిర్వహించుకునేందుకు.. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన తమకు కూర్చునేందుకు కుర్చీలు లేక నేలపై కూర్చోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటలు పనిచేసే తమకు.. నెలవారి ఇచ్చే వేతనాలు సైతం సకాలంలో చెల్లించడం లేదని తెలిపారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, అధికారులు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆస్పత్రి ప్రాంగణమంతా అపరిశుభ్ర వాతావరణంతో.. పిచ్చిమొక్కలతో ఉండటం వల్ల విషపూరితమైన పాములు సంచరిస్తున్నాయన్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తే.. తమతోనే గడ్డి తీయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
TAGGED:
ఆశా వర్కర్ల ఆందోళనలు