ఆసరా చెక్కుల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం.. సొమ్మసిల్లి పడిపోయిన మహిళ.. - జంగారెడ్డి గూడెం లేటెస్ట్ న్యూస్
Asara Checks Distribution Programme: ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలోని ఓ కల్యాణ మండపంలో జరిగిన వైయస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం గందరగోళానికి దారితీసింది. ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం కోసం అధికారులు.. పెద్ద ఎత్తున మహిళలను తీసుకుని వచ్చారు. దీంతో కల్యాణ మండపం ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. అయితే ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ ఆ మహిళ పడిపోవటాన్ని గమనించి వెంటనే ఆమెను కారులో ఎక్కించి చికిత్స మేరకు సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వేలాది మంది మహిళలను చెక్కుల పంపిణీ కార్యక్రమానికి పిలిచి కనీసం తాగటానికి మంచినీళ్లు కూడా ఇవ్వకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఎత్తున తమను పిలిచిన అధికారులు.. తమకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయటంలో విఫలమయ్యారని మహిళలు వాపోయారు. దీంతో కోపోద్రిక్తులైన కొంతమంది మహిళలు.. కార్యక్రమం జరుగుతుండగానే గేట్లు తోసుకుని బయటకు వచ్చేశారు.