Prathidwani: హామీలతో ఆశలు కల్పించి.. అధికారంలోకి రాగానే అటకెక్కించి - ఎన్నికల ప్రచారం
Prathidwani : నాలుగేళ్లలో నవ్యాంధ్రలో నవశకానికి నాంది. 2019.. మే 30వ తేదీన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెబుతున్న మాట ఇది. అంతేకాదు... ఇచ్చిన హామీల్లో 98.5శాతం హామీలు అమలు చేసి.. ఎన్నికల మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం ఇచ్చామని అంటోంది. మరి అవన్నీ నిజాలేనా? 4 ఏళ్లలో మాట, మడమ ఎన్ని వంకర్లు తిరిగింది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై నాడు ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీలకు జనం ఆకర్షితులై అధికారం కట్టబెట్టారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై ప్రతిపక్షంలో ఉండగా జగన్ ఆనాటి అధికారపక్షంపై ఎలా విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ మాటలను నమ్మిన ఓటర్లు.. ఆయన అడిగినన్ని ఎంపీ స్థానాలు కట్టబెట్టారు. మరి ఈ నాలుగేళ్లలో జగన్ ఎందుకు కేంద్రం మెడలు వంచలేదు? 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నిరుద్యోగులకు కల్పించిన ఆశలు అడియాశలయ్యాయి. అన్నింటికంటే మరో మద్యపాన నిషేధం హామీ అటకెక్కింది. తనను సీఎం చేస్తే ఆంధ్ర ప్రదేశ్‌లో మద్యం అనేదే లేకుండా చేస్తామని మహిళలకు ఇచ్చిన మాట వెనక్కి తీసుకున్నట్టుంది. ఇదే అంశంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈ చర్చలో మహాసేన వ్యవస్థాపకుడు సరిపెల్ల రాజేష్, వ్యవసాయ కార్మికసంఘం నేత వి. వెంకటేశ్వర్లు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.