మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆర్టీసీ నివేదిక - సంక్రాంతి కానుకగా డోర్ డెలివరీ సేవలు - rtc bus
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 11, 2024, 3:01 PM IST
APSRTC MD Dwaraka TirumalaRao about Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. ఒకవేళ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే సంస్థపై ఎంత భారం పడుతుందో వివరిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందించామని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ కానుకగా బుధవారం నుంచి డోర్ డెలివరీ, డోర్ పికప్ లాజిస్టిక్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎండీ తెలిపారు.
ఇకపై లాజిస్టిక్స్ సేవలను ఆర్టీసీ ద్వారానే నిర్వహిస్తామన్నారు. గతంలో ప్రైవేటు సంస్థకు ఈ సేవలను అప్పగించామని, దీనిపై అనుకున్న ఫలితం రాకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తిరుమలరావు వెల్లడించారు. www.apsrtclogistics.in వెబ్సైట్ను సంప్రదిస్తే డోర్ పికప్ ఉంటుందన్నారు. ఈ సేవలను పైలట్ ప్రాజెక్టుగా మొదట విజయవాడలో ప్రారంభించి, త్వరలోనే అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు. సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రానుపోను ప్రయాణానికి టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకుంటే ధరపై పది శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలో సరికొత్త హంగులతో 1500 సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు.