మంగళగిరి చేనేత వస్త్రాల బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం యాప్: నారా లోకేశ్ - lokesh latest
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 12:25 PM IST
App for Mangalagiri handloom garment branding and marketing: మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్ర చిత్రపటంలో నిలిపేవిధంగా అభివృద్ధి చేయాలన్నదే తన సంకల్పమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. మంగళగిరిలోని నేతన్నలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని లోకేశ్ హామీ ఇచ్చారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. మంగళగిరి చేనేత వస్త్రాలకు బ్రాండింగ్, మార్కెటింగ్ కల్పించేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు లోకేశ్ తెలిపారు.
రెండో రోజు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన లోకేశ్, మంగళగిరి అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై నగర ప్రముఖులతో సమావేశమయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అంశాలపై ప్రముఖ వైద్యులు అన్నపురెడ్డి సత్యనారాయణరెడ్డితో చర్చించారు. తమ ఇంటికి వచ్చిన లోకేశ్‌ను సత్యనారాయణరెడ్డి కుటుంబసభ్యులు ఘనంగా సత్కరించారు. టీడీపీ గెలుపుకోసం సత్యనారాయణరెడ్డి సహకారం అందించాలని లోకేశ్ కోరారు. అనంతరం ప్రముఖ చేనేతవస్త్ర వ్యాపారి అందె నాగప్రసాద్‌తో సమావేశమైన లోకేశ్, నియోజకవర్గంలో నేతన్నలు ఎదుర్కొంటున్న సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. సీఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ అధినేత తుమ్మా సాంబశివరావుతో లోకేశ్ భేటీ అయ్యారు.