APNGOs Association State Level Conferences: ''12వ పీఆర్సీనీ సైతం ఎపీఎన్జీవో సాధిస్తుంది'' - ఎపీ ఎన్జీవో మహాసభకు సీఎం జగన్మోహన్ రెడ్డి
APNGOs Association State Level Conferences: సోమ, మంగళవారాల్లో విజయవాడలో నిర్వహించనున్న ఎపీ ఎన్జీవో అసోషియేషన్ 21వ కౌన్సిల్ మహాసభలను జయప్రదం చేయాలని.. ఎపీ ఎన్జీవో సంఘం నేతలు కోరారు. మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ఎన్జీవో ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే మహాసభల కోసం చేస్తున్న ఏర్పాట్లను.. ఎపీ ఎన్జీవో సంఘం నేతలు బండి శ్రీనివాస్, శివారెడ్డి, తదితరులు పరిశీలించారు. సోమవారం నిర్వహించబోయే మహాసభకు సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారని బండి శ్రీనివాస్ తెలిపారు. మహాసభలో ఉద్యోగులకు సంబంధించి పలు సమస్యలపై చర్చించి తీర్మానాలు చేస్తామన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతాపరంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఉద్యోగులు క్రమశిక్షణతో మహాసభను జయప్రదం చేయాలని కోరారు. ఎపీఎన్జీవోస్లో బైలాస్ పదవుల్లో 33 శాతం మహిళలకు అవకాశం కల్పించే విధంగా మహాసభలో తీర్మానం చేస్తామని శివారెడ్డి తెలిపారు. 74 ఏళ్ల చరిత్ర కల్గిన ఎపీఎన్జీవోలో ఇప్పటి వరకు 11 పీఆర్సీలు సాధించిందని, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీలను ఇప్పించామని గుర్తు చేశారు. మెరుగైన 12వ పీఆర్సీనీ సైతం ఎపీఎన్జీవో సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహాసభకు ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.