4 year Honours program: ఇకపై డిగ్రీ నాలుగేళ్లు.. ఈ సంవత్సరం నుంచే ఏర్పాట్లు...
4 year Honours program in AP: నూతన విద్యా విధానం అమలులో భాగంగా... ఏపీలో నాలుగు సంవత్సరాల డిగ్రీని ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించేందుకు చర్యలు ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ కె. రామ్మోహనరావు తెలిపారు. నూతన విద్యా విధానంలో భాగంగా రాష్ట్రంలో అన్ని యూనివర్శిటీల్లో నాలుగేళ్ల డిగ్రీని అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో ఏక సబ్జెట్ విధానాన్నీ తీసుకొచ్చినట్లు రామ్మోహనరావు పేర్కొన్నారు. ఏక సబ్జెక్ట్ విధానంలో ఎంపిక చేసుకున్న సబ్జెక్టుతో పాటు రెండో ప్రాధాన్యత సబ్జెక్టుగా మరో సబ్జెక్టుని ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. ఒకే సబ్జెక్టు డిగ్రీతో ప్రతీ విద్యార్థి తనకు ఇష్టమైన సబ్జెక్టులో విద్యనభ్యసించవచ్చని తెలిపారు. ఒక సబ్జెక్టుపై పూర్తి స్థాయిలో అవగాహన పొందడానికి నూతన విద్యా విధానం దోహదం చేస్తుందన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసి అనివార్య కారణాల వల్ల మధ్యలో చదువు ఆపేస్తే మూడేళ్లలో మరలా డిగ్రీ ద్వితీయ సంవత్సరంలో చేరవచ్చన్నారు. డిగ్రీలో నాలుగు సంవత్సరాలకు గాను ఏ ఏడాదికి ఆ ఏడాది విద్యసభ్యసించినట్లు సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు రామ్మోహనరావు తెలిపారు.