Manipur violence: మణిపుర్ నుంచి సొంతూర్లకు చేరుకున్న ఏపీ స్టూడెంట్స్.. - సొంతూర్లకు చేరుకున్న ఏపీ విద్యార్థులు
Manipur violence: మణిపుర్‌లో చిక్కుకుపోయిన 163 మంది విద్యార్థులు సోమవారం సురక్షితంగా రాష్ట్రానికి చేరుకున్నారు. ఇంఫాల్ నుంచి నేరుగా హైదరాబాద్‌కు ఓ విమానంలో, కోల్‌కతాకు మరో విమానంలో విద్యార్థులను తరలించారు. హైదరాబాద్‌కు వచ్చిన 108 మందిని వేర్వేరు బస్సుల్లో వారి గమ్యస్థానాలకు చేర్చారు. కోల్‌కతాకు చేరుకున్న 55 మంది విద్యార్థినులను మూడు కనెక్టింగ్ విమానాల ద్వారా హైదరాబాద్‌కు తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. వీరిలో 11 మంది కోల్‌కతా నుంచే తమ స్వస్థలాలకు చేరుకునేందుకు సొంతంగా ఏర్పాట్లు చేసుకున్నారు. మిగిలిన వారు హైదరాబాద్‌కు చేరుకున్నాక రెండు ప్రత్యేక బస్సుల్లో విజయవాడకు.. అక్కడి నుంచి విద్యార్థులను వారి ఇళ్లకు అధికారులు చేర్చారు.
కాగా.. ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్‌లో ఇటీవల చెలరేగిన హింస కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన పలువురు అక్కడ నీట్, కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, ఏజీ బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సులు చేస్తున్నారు. గత ఐదు రోజులుగా తీవ్ర హింసాత్మక పరిస్థితులు కారణంగా.. అటు బయటకు రాలేక, హాస్టళ్లల్లో సరైన ఆహారం లేక అవస్థలు పడ్డారు. ఎట్టకేలకు వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల్లో స్వస్థలాలకు చేరుకున్నారు. మొదటి బృందం సోమవారం మధ్యాహ్నానికి హైదరాబాద్‌కు, అక్కడి నుంచి బస్సుల్లో రాత్రికి వారి జిల్లాకు చేరుకుంది. మరికొందరు విడతల వారీగా రానున్నారు. విజయవాడ, జగ్గయ్యపేట, గూడవల్లి, పెనుగంచిప్రోలుకు చెందిన విద్యార్ధులు వారి స్వస్థలాలకు చేరుకున్నారు.
హైదరాబాద్ నుంచి మూడు బస్సుల్లో విద్యార్థులు ఏపీకు బయలు దేరారు. విజయవాడ బస్ స్టేషన్‌కు మొత్తం 13 మంది చేరుకున్నారు. వీరంతా నెల్లూరు, ప్రకాశం, వినుకొండ, నర్సరావుపేట ప్రాంతాలకు చెందిన వాళ్లే. ఆర్టీసీ అధికారులు వారి వివరాలు సేకరించి.. వేర్వేరు బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. మణిపుర్‌లో ఎప్పుడు ఎటువైపు నుంచి బాంబులు పడతాయోనని భయం వేసిందని విద్యార్థులు తెలిపారు. బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ ఆగిపోవటంతో దీనిపై ఇంటికి సమాచారం ఇవ్వలేక పోయామని అన్నారు. లైట్స్ ఆఫ్ చేసి రూమ్స్‌లోనే దాక్కుని గడిపామని విద్యార్థులు తెలిపారు. విమానం ఎక్కేంత వరకు భయంగానే ఉందని వారు చెప్పారు. ఏపీకు చేరుకోగానే భయమంతా పోయి చాలా ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు.
మణిపుర్‌లో చిక్కుకున్న కడప జిల్లా చెందిన పలువురు విద్యార్థులు రాత్రి సురక్షితంగా స్వస్థలాలకు చేరుకున్నారు. మణిపుర్ నుంచి విద్యార్థులను విమానం ద్వారా హైదరాబాద్‌కు తరలించి అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులను ప్రత్యేకమైన బస్సులో ఆయా ప్రాంతాలకు సురక్షితంగా తరలించారు. అందులో భాగంగా కడప, మదనపల్లి, తిరుపతికి చెందిన ఆరుగురు విద్యార్థులు రాత్రి 11 గంటలకు కడప ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి వారిని బస్సుల్లో స్వస్థలాలకు పంపించారు. తమ పిల్లలు స్వస్థలాలకు రావడంతో తల్లిదండ్రుల సంతోషాలకు అవధులు లేవు. విద్యార్థులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. భీకరమైన భయానకమైన వాతావరణంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవించమని విద్యార్థులు వాపోయారు. పెద్ద పెద్ద శబ్దాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో బిక్కు బిక్కు మంటూ గడిపామని చెప్పారు. కొంతమంది విద్యార్థులు భావోద్వేకానికి గురై నోట మాట రాక నివాసాలకు చేరుకున్నారు. విద్యార్థులను ఉచిత రవాణా సౌకర్యం కల్పించి వారి నివాసాలకు తరలించారు. తల్లిదండ్రులు పిల్లలను నివాసాలకు తీసుకెళ్లారు. మణిపుర్‌లో సాధారణ పరిస్థితిలో వచ్చేంతవరకు తమ పిల్లలను పంపించమని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు.