AP Professional Forum Demands CBI Inquiry: "రాష్ట్ర ఆర్థిక స్థితిపై సీబీఐ విచారణ జరిపించాలి"
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2023, 10:36 AM IST
AP Professional Forum Demands CBI Inquiry: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఈ-మార్కెటింగ్ వంటి సంస్థలే.. రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా బిల్లులు చెల్లించడం లేదని పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోందని ప్రొఫెషనల్ ఫోరమ్ వివరించింది. ఏపీ ప్రొఫెషనల్ ఫోరమ్ అధ్యక్షులు నేతి మహేశ్వరరావు, పిడికిటి మల్లికార్జునరావు, జొన్నలగడ్డ శ్రీనివాసరావు విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు.
చాలా మంది గుత్తేదారులు, సర్పంచులు చేసిన పనులకు.. బిల్లులు రాకపోవడంతో బలన్మరణాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఉద్యోగులకు జీతాలు టీఏ, డీఏలు, పింఛన్లు ఇవ్వలేని దురదృష్టకర స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఆర్థిక అత్యవసర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. మానవత్వ విలువలున్న ప్రభుత్వాలు ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చుపెట్టడానికి ఆలోచిస్తారని- కానీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాగ్ తాజా నివేదికలో పొందుపరిచిన అంశాలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. 2021-22 కాగ్ నివేదిక ప్రకారం సుమారు 11,237 కోట్ల రూపాయల చెల్లింపులకు సంబందించి.. లావాదేవీల్లో అనుమతులు లేవన్నారు.