నగల వ్యాపారి ఇంట్లో చోరీ.. ఛేదించిన పోలీసులు.. 9కిలోల బంగారం స్వాధీనం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 1, 2023, 1:27 PM IST
|Updated : Nov 1, 2023, 2:45 PM IST
AP Police Seized 9KGs Gold: పశ్చిమ గోదావరి జిల్లాలో గత నెలలో నగల వ్యాపారి ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 9కిలోల బంగారు అభరణాలతోపాటు.. ఇద్దరు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠాగా పోలీసులు గుర్తించారు. వీరికి సహకరించిన మరో వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెలలో తణుకు పట్టణానికి చెందిన ఓ నగల వ్యాపారి ఇంట్లోకి ఐదుగురు దుండగులు చొరబడి .. కుటుంబసభ్యులందర్నీ తాళ్లతో బంధించి దొంగతనానికి పాల్పడ్డారు. దీంతో నగల వ్యాపారి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడ్డారనే సమాచారంతో.. పోలీసులు మహారాష్ట్రకు వెళ్లి అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. ఐదు రోజుల పాటు విచారణ కొనసాగిన అనంతరం పోలీసులు మహారాష్ట్రలో అసలు నిందితులను పట్టుకున్నారు. నిందితుల్లో జతిన్ అనే వ్యక్తి చోరిల్లో ఆరితేరినవాడని పోలీసులు గుర్తించారు. వారి నుంచి 9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. బంగారం విలువ సుమారు రూ.5కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రధాన నిందితులకు సహకరించిన ముగ్గురు వ్యక్తులను గతంలోనే అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.