న్యాయ వ్యవస్థలో జోక్యానికి సీఎం యత్నిస్తున్నారు: నాదెండ్ల మనోహర్ - జనసేన పీఏసీ ఛైర్మన్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 2, 2024, 3:22 PM IST
AP Land Protection Act:ప్రజలకు నష్టం చేకూర్చి వారు లబ్ధి పొందేందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూరక్ష చట్టం తీసుకువచ్చిందని తెలుగుదేశం, జనసేన నేతలు ఆరోపించారు. భూహక్కు చట్టం రద్దు చేయాలంటూ తెనాలిలో బార్ ఆసోషియేషన్ చేస్తున్న నిరసనకు ఇరు పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. న్యాయవ్యవస్థ పరిధిలో జోక్యం చేసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం - జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూరక్ష చట్టాన్ని నిలిపివేస్తామని హామీ ఇచ్చారు.
భూ హక్కు చట్టం రద్దుకు బార్ ఆసోషియేషన్ నిరసన చేపట్టగా, ఆ ఆందోళనకు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సంఘీభావం ప్రకటించారు. భూ హక్కు చట్టం అమల్లోకి వస్తే ప్రజలు ఇబ్బంది పడతారని మనోహర్ అన్నారు. మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా ఈ ఆందోళనకు మద్దతిచ్చారు. న్యాయవ్యవస్థ పరిధిలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. న్యాయవ్యవస్థ ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వేతోనే రైతుల మధ్య వివాదాలు నెలకొన్నాయని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు. కొత్త చట్టం ద్వారా వివాదాస్పద భూముల్ని కాజేసేందుకు వైఎస్సార్సీపీ నేతలు కుట్ర పన్నారన్నారు.