Bopparaju comments: ఇకపై ప్రభుత్వ పెద్దలను నమ్మం.. దశాలవారీగా ఉద్యమాలు: బొప్పరాజు వెంకటేశ్వర్లు - AP ICASA Amaravati news
AP ICASA Amaravati president fire on AP government: రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్నా.. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని.. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మలిదశ ఉద్యమంలో భాగంగా ఆయన ఈరోజు అనంతపురం జిల్లా ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై, ప్రభుత్వ పెద్దలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
''రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగులు ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వం మాత్రం లెక్కల విషయంలో ఎటువంటి సమాధానం చెప్పడం లేదు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గత 66 రోజులుగా శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. మలిదశ ఉద్యమంలో భాగంగా 175 మంది ఎమ్మెల్యేలు, 25 ఎంపీలకు ఉద్యోగుల ఆవేదన చెబుదాం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజాప్రతినిధులంతా ఉద్యోగుల ఇబ్బందుల్ని, సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. మా డిమాండ్ల సాధనకు పోరాటాన్ని ఉద్ధృతం చేస్తాం. ఈ నెల 17వ తేదీ నుంచి దశాలవారీగా శాంతియుత ఉద్యమాలు చేపట్టనున్నాం. ఈ ఉద్యమాలు ఈ నెల 30వ తేదీ వరకు చేస్తాం. ప్రజలు కూడా మా ఉద్యమానికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యమాలు చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం అణచివేసే కుట్ర చేస్తోంది. ఉద్యోగ సంఘాలు కలిసి రావాలి. ఉద్యమాలకు సిద్ధం కావాలి. మరొకసారి చలో విజయవాడ లాంటి ఆలోచన కార్యక్రమం రాకముందే.. ప్రభుత్వం స్పందించాలి'' అని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
అనంతరం ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని.. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు వేడుకున్నారు. రాష్ట్రంలోని కొంతమంది పెద్దలు.. ఉద్యోగులకు, ఉద్యోగ నాయకులకు మధ్య మనస్పర్థలు సృష్టించారని, ఇప్పటికే ప్రభుత్వ పెద్దలకు సమయం కూడా ఇచ్చామని.. ఇక ప్రభుత్వ పెద్దలను నమ్మే పరిస్థితి లేదని మండిపడ్డారు. ప్రస్తుతం 13 లక్షల మంది ఉద్యోగులు తీవ్రమైన సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారని బొప్పరాజు ఆవేదన చెందారు.