AP JAC Amaravati: "ఉద్యమంలో కలిసిరాకుండా విమర్శలా..? వేతనాల్లో జాప్యానికి ఉన్నతాధికారులే కారణం" - ఏపీ జేఏసీ ఉద్యోగులు
AP JAC Amaravati Chairman Bopparaju: రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తున్నామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ ఏపీ జేఏసీ అమరావతి 92 రోజుల ఉద్యమ ఫలితంగా 48 డిమాండ్లలో 37 పరిష్కారం అయ్యాయని, మరో 30 రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని చెప్పారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు అందక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బొప్పరాజు.. ఆయా శాఖల్లో ఉన్నతాధికారుల పట్టించుకోకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఔట్ సోర్సింగ్ సిబ్బందికి న్యాయం జరిగేలా ఏపీ జేఏసీ అమరావతి కృషి చేస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సమస్యలపై పోరాటం చేసిన జేఏసీ నాయకులు, సమస్యలు పరిష్కరించిన ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతి ఒంటరిగా పోరాటం చేసి సమస్యలు పరిష్కరిస్తే... ఉద్యమానికి కలిసి రాని కొన్ని ఉద్యోగ సంఘాలు విమర్శలు చేయడం అర్థరహితమని ఏపీ జేఏసీ అమరావతి ప్రధాన కార్యదర్శి దామోదర్ రావు అన్నారు. సంఘాలన్నీ కలిసి వచ్చుంటే ప్రభుత్వం ఓపీఎస్ పైన సరైన నిర్ణయం తీసుకుని ఉండేదేమోనని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఏదైనా సమస్య వస్తే ఏపీ జేఏసీ అమరావతి అండగా ఉంటుందని చెప్పారు.