
AP JAC Amaravati 'లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చేంతవరకూ.. ఉద్యమం కొనసాగుతుంది' - ap news
AP JAC Amaravati Chairman Bopparaju Venkateswarlu: ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవి కాబట్టే ప్రభుత్వం ముందుకు వస్తోందని ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. మిగతా డిమాండ్లపై కూడా చర్చ జరగాలి, పరిష్కరించాలని కోరారు. డీఏ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం.. లిఖిత పూర్వకంగా స్పష్టం చేసేంతవరకు ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. నాలుగోదశ ఉద్యమానికి సిద్ధమవుతున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కరం కోసం ఈనెల 30వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపడుతున్నట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 27న ఏలూరులో మూడవ ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.. ఉద్యోగులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉద్యమం చేస్తుంటేనే.. సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తోందని అన్నారు. ఉద్యోగుల న్యాయమైన ఇబ్బందులపై ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి వారికి వినతిపత్రాలు అందించామని, తాము చేస్తోంది ధర్మపోరాటమని చెప్పారు. ప్రభుత్వం మొండిపట్టుదలతో ఉంటే ఛలో విజయవాడ కూడా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.