Appointment new CJ to AP High Court: ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ నియామకం - Andhra Pradesh important news
Justice Dheeraj Singh Thakur as CJ of AP High Court: ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ నియమితులయ్యారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆయనను (జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్).. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం జూలై 5వ తేదీన సిఫార్స్ చేయగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను సోమవారం రోజున కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ జారీ చేసింది.
ఏపీ హైకోర్టుకు కొత్త సీజే.. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఇటీవలే పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. దీంతో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏ.వి. శేషసాయి నియమితులయ్యారు. తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం.. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ పేరును సిఫార్స్ చేయగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దాంతో ఆయన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ విషయానికొస్తే.. 1964 ఏప్రిల్ 25వ తేదీన జమ్మూకశ్మీర్‌లో జన్మించారు. 1989 అక్టోబరు 18న దిల్లీ, జమ్ముకశ్మీర్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ఆ తర్వాత 2011లో సీనియర్ అడ్వొకేట్‌గా పదోన్నతి పొందారు. 2013 సంవత్సరం మార్చి నెల 8వ తేదీన జమ్ముకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం గతేడాది జూన్‌లో బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో ఇటీవలే సుప్రీంకోర్టు కొలీజియం ఆయన పేరును సిఫార్స్ చేయగా.. కేంద్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టు సీజేగా నియమిస్తూ..గెజిట్ నోటిఫికేషన్ విడుదుల చేసింది. దీంతో ఆయన జులై (ఈ నెల) 27వ తేదీన లేదా 28వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.