AP High Court on Votes Missing Petition: ఏపీలో ఓట్లు తొలగింపు వ్యవహారంపై స్పందించిన హైకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘం, అధికారులకు నోటీసులు..
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 27, 2023, 10:15 AM IST
AP High Court on Votes Missing Petition: విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఓట్లు తొలగింపు వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దాఖలుచేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. నియోజకవర్గం పరిధిలో 40వేల ఓట్లు తొలగింపుపై విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారి, ఎలక్టోరల్ రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా ఓట్లు తొలగిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. రాజకీయ దురుద్దేశంతో కుట్రపూరితంగా ఓట్లు తొలగిస్తున్నారన్నారు. దీనిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది శివదర్శన్ స్పందిస్తూ.. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఆ వివరాలను పిటిషనర్‌కు అందజేస్తామన్నారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.