ఆ భూములపై ఎలాంటి లావాదేవీలు జరపకూడదు: హైకోర్టు - కోర్టు తీర్పులపై నిరసన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 6, 2023, 9:15 PM IST
|Updated : Dec 7, 2023, 6:32 AM IST
High Court Key Orders In Vizag Hayagriva Land Dispute:విశాఖ ఎండాడలో అనాథలకు, వృద్ధులకు కేటాయించిన 12.51 ఎకరాల హయగ్రీవ భూములపై జనసేన కార్పోరేటర్ మూర్తి యాదవ్, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటీషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. జిల్లా కలెక్టర్ భూకేటాయింపు రద్దు ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో రెండు నెలల్లోపు తెలియజేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటివరకు హయగ్రీయ భూములపై ఎటువంటి లావాదేవీలు జరపకూడదని ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది.
అసలు కథ ఇది: వృద్ధుల కోసం ఆశ్రమం, అనాథ శరణాలయం ఉచితంగా నిర్మించడంతో పాటుగా, వృద్ధులు సౌకర్యంగా నివసించడానికి వీలుగా కాటేజీలు నిర్మిస్తామంటూ, విశాఖలో 2008 సంవత్సరంలో హయగ్రీవ ఫార్స్మ్ అండ్ డెవలపర్స్ సంస్థ ఉమ్మడి రాష్ట్రంలో స్థలం కోసం దరఖాస్తు చేసుకుంది. అప్పటి కలెక్టర్ ఎకరం కోటిన్నర చొప్పున కేటాయించవచ్చని సిఫారసు చేశారు. అయితే, వృద్ధులు, అనాథలకు కాటేజీలు కట్టడం అనే కారణం చూపి, ఎకరం కేవలం 45 లక్షల రూపాయల చొప్పున ఇచ్చేందుకు అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. 2008 జూన్ 12న భూమి కేటాయించింది. అందులో 60 శాతం భూమిని స్థలాలుగా మార్చి వృద్ధులకు విక్రయించడంతో పాటుగా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా కాటేజీలు నిర్మించాలి. 30 శాతం భూమిని మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలని నిర్ణయించింది. ఈ లెక్క ప్రకారం హయగ్రీవ సంస్థకు కేటాయించిన 12.51 ఎకరాల్లో 6వేల 054.80 చదరపు గజాల్లో వృద్ధాశ్రమం, అనాథ శరణాలయం నిర్మించాల్సి ఉంది. అలాగే 18వేల 164.50 చదరపు గజాల్లో మౌలిక వసతుల కల్పించాలి. 36వేల 329.10 చదరపు గజాల్లో కాటేజీల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకూ అక్కడ ఎలాంటి వృద్ధాశ్రమం, అనాథాశ్రమం నిర్మించలేదు. వృద్ధులకు కాటేజీలు నిర్మించాల్సిన 36వేల329.10 చదరపు గజాల్లో సైతం 32వేల 857 చదరపు గజాల్ని ఇప్పటికే అమ్మేసింది. అది స్థిరాస్తి వ్యాపారం తప్ప, మరొకటి కాదని భూ కేటాయింపు రద్దు చేయాలని అప్పటి జిల్లా కలెక్టర్ మల్లికార్జున జనవరిలో నివేదిక పంపారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇదే అంశంపై మూర్తి యాదవ్, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వేసిన పిటీషన్లను కోర్టు విచారణ చేపట్టింది.
TAGGED:
Vizag Hayagriva Land Dispute