ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ap_fiber_grid

ETV Bharat / videos

AP Fiber Grid Project Case Against Chandrababu: విచారణ జరిపి వివరాలను సమర్పించాలని సీఐడీ ఎస్​హెచ్​వోను ఆదేశించిన హైకోర్టు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2023, 1:35 PM IST

AP Fiber Grid Project Case Against Chandrababu:ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు హైకోర్టులో శుక్రవారం వేసిన అత్యవసర వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్ రెడ్డి విచారణ జరిపి, పూర్తి వివరాలను సమర్పించాలని మంగళగిరి సీఐడీ ఎస్​హెచ్​వోను ఆదేశించారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో ఏపీ సీఐడీ 2021లో కేసు నమోదు చేసింది. 2021 సెప్టెంబరు 9న నమోదు చేసిన కేసులో తనను ఇటీవల 25వ నిందితుడిగా చేర్చారని చంద్రబాబు పిటిషన్​లో పేర్కొన్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును 2014-19 మధ్య విజయవంతంగా అమలు చేశామన్నారు. 

2021లో నమోదుచేసిన కేసులో సీఐడీ ఇప్పటివరకూ తనకు నోటీసు ఇవ్వకుండా ఏకపక్షంగా నిందితుడిగా చేర్చిందన్నారు. టెండర్ కమిటీలో సభ్యుడిగా ఉన్న వేమూరి హరికృష్ణప్రసాద్.. టెరాసాఫ్ట్ సంస్థ ఎండీ తుమ్మల గోపీచంద్, ఇతర అధికారులతో కుమ్మక్కై 321 కోట్ల రూపాయల టెండర్​ను ఆ సంస్థకు అప్పగించారని ఏపీ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ సంస్థ ఎండీ 2021 జులై 16న ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదుచేసిందని తెలిపారు. ఆ ఎఫ్​ఐఆర్​లో తన పేరు నిందితుడిగా చేర్చలేదన్న చంద్రబాబు.. స్కిల్ కేసులో రిమాండు విధించాక.. సీఐడీ తన పేరును నిందితుల జాబితాలో చేర్చి ఏసీబీ కోర్టులో పీటీ వారంటు కోసం దరఖాస్తు చేసిందని వివరించారు. 

ఫైబర్ గ్రిడ్ టెండర్ అప్పగింతలో అవకతవకలు జరిగాయనేందుకు ఆధారాల్లేవని పిటిషన్​లో పేర్కొన్నారు. సీఐడీ ఇప్పటికే పలువుర్ని విచారించి వాంగ్మూలాలను నమోదుచేసిందని.. ఇక తనను అదుపులోకి తీసుకుని విచారించాల్సిన ప్రశ్నే తలెత్తదన్నారు. విచారణ పేరుతో తనను అవమానపరిచేందుకే సీఐడీ ఏసీబీ కోర్టులో పీటీ వారంటు దరఖాస్తు దాఖలు చేసిందని చంద్రబాబు అన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిలు మంజూరుచేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details