AP Employee Welfare Advisor Chandrasekhar Reddy: ఐదేళ్ల నిబంధన తొలగిస్తూ సీఎం నిర్ణయం.. 14 వేల మంది ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆస్కారం
AP Employee Welfare Advisor Chandrasekhar Reddy: ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణలో 5 ఏళ్ల నిబంధనను తొలగిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని ఏపీ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వం ప్రకటించిన దానికంటే ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులర్ అవుతారని ఆయన వెల్లడించారు. మొత్తం 14 వేల మంది ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు ఆస్కారం ఉందన్నారు. ప్రస్తుతం 1500 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అంగళ్లు ఘటనలో పోలీసులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తే టీడీపీ తన కార్యకర్తలతో వారిని కొట్టిస్తుందా అని చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్ష, అధికార పక్షంలోని నేతల రక్షణ కోసమే పోలీసు ఉద్యోగులు పని చేస్తున్నారని అన్నారు. పోలీసు వ్యవస్థ తిరగబడి రక్షణ కల్పించలేమని ఎదురుతిరిగితే ప్రజాప్రతినిధుల పరిస్థితి ఏమిటని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షనేతలు కొందరు ఉద్యోగ సంఘనేతలపై విమర్శలు చేయటం శోచనీయమన్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో విజయవాడలో జరిగే ఏపీ ఎన్జీఓ బహిరంగ సభకు సీఎం హాజరు అవుతారని తెలిపారు.