Dy Speaker Kolagatla Yoga: నీటిపై డిప్యూటీ స్పీకర్ కోలగట్ల యోగాసనాలు - National Swimming Pool Day 2023
AP Deputy Speaker Kolagatla Water Yoga: రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నీటిపై తేలుతూ యోగసనాలు వేశారు. ఈ నెల 11న జాతీయ స్విమ్మింగ్ పూల్ డేను పురష్కరించుకుని విజయనగరం కంటోన్మెంట్ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్సులోని స్విమ్మింగ్ పూల్‌లో నీటిపై తేలియాడుతూ ఆరగంట సేపు యోగా చేశారు. అనంతరం కాసేపు సరదాగా ఈత కొట్టారు. యోగా చేస్తుంటే అక్కడికి వచ్చిన ఆయన అభిమానులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాల ప్రభావం క్రీడలపై, ముఖ్యంగా పిల్లలపై పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారికి స్విమ్మింగ్ అవసరమని.. దాని ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. స్విమ్మింగ్‌పై అసక్తి ఉన్న పిల్లలను.. తల్లిదండ్రులు ప్రొత్సహించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను, స్విమ్మింగ్ పూల్‌ను నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. పిల్లల కోసం కంటోన్మెంట్ ప్రాంతంలో ఆధునిక వసతులతో కూడిన పూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. ఈ నెల 11న కంటోన్మెంట్ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్సులోని స్విమ్మింగ్ పూల్‌లో జల క్రీడల ప్రాధాన్యతను వివరిస్తూ యోగా జలాసనాలు వేయనున్నట్లు ప్రకటించారు.