AP Builders Association Meeting: పాత బకాయిలు చెల్లిస్తేనే.. కొత్త పనులకు ఒప్పందాలు : బిల్డర్స్ అసోసియేషన్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 9, 2023, 12:01 PM IST
AP Builders Association meeting: కాంట్రాక్టు పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త పనులకు ఒప్పందాలు చేసుకుంటామని రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ తీర్మానించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్ అండ్ బీ పరిధిలో చేసిన పనులకు 15 వందల కోట్ల రూపాయలు.. పంచాయతీ రాజ్‌కు సంబంధించి 600 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని గుత్తేదారులు వివరించారు.
పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కాంట్రాక్టర్లు వాపోయారు. దీంతో బ్యాంకులకు వాయిదాలు కట్టేలేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఇటీవల టెండర్స్ వేసిన పనులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవాలని ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులు ఒత్తిళ్లు తీసుకురావడం సరికాదని కాంట్రాక్టర్లు పేర్కొన్నారు. నవంబర్ నుంచి పూర్తిస్థాయిలో చెల్లింపులు లేవని.. ప్రభుత్వానికి కావాల్సిన చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు చెందిన కొందరికి మాత్రమే ఇష్టానుసారం బిల్లులు చెల్లిస్తున్నారని ఆరోపించారు.