యానాంలో ఉత్సాహంగా సాగిన జంతు ప్రదర్శన.. బహుమతులిచ్చిన డిప్యూటీ కలెక్టర్ - Yanam Deputy Collector Muniswami
ఇటీవల కాలంలో ప్రజలకు పెంపుడు జంతువులపై మమకారం ఎక్కువైందనే చెప్పాలి.. ధనవంతులు ఖరీదైన విదేశీ జాతుల శునకాలను పెంచుకుంటుంటే.. మధ్య తరగతి వారు కూడా ఆదాయానికి తగినట్టుగా దేశీయంగా లభించే మేలుజాతి రకాలకు చెందిన వాటిని ఆదరిస్తున్నారు. పట్టణాల్లోనూ.. పల్లెల్లోనూ.. వీధి శునకాల సంఖ్య తగ్గిపోయి.. ప్రతి ఇంటిలోనూ ఒక పెంపుడు శునకం కనిపిస్తోంది.. వీటితోపాటు రామచిలుకలు.. పావురాలు.. కుందేళ్లు.. కోడిపుంజులు పెంచేవారు ఉన్నారు. ఇక పాడి పశువుల విషయానికొస్తే ఒంగోలు.. ముర్రాజాతి పాడి గేదెలతో పాటు పుంగనూరు జాతికి చెందిన తక్కువ ఎత్తు ఉండే ఆవు దూడలను.. సంకరజాతి ఆవులను పెంచుకుంటూ వాటిని ఆదాయ వనరులుగా కూడా మలుచుకుంటున్నారు.
ఇలాంటి వారిని మరింతగా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వం వీరి మధ్య పోటీలు నిర్వహించి వాటి యజమానులకు బహుమతులు అందించాలని నిర్ణయించింది.. దీనిలో భాగంగా.. కేంద్రపాలిత ప్రాంతం యానంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పెంపుడు జంతువుల పోటీలు నిర్వహించింది.. దీనిలో పలు రకాల శునకాలు.. ముచ్చట గొలిపే రామచిలుకలు.. పాడిగేదెలు.. దేశవాళీ సంకరజాతి.. పుంగనూరు ఆవులను, పెంపుడు కోడిపుంజులను వాటి యజమానులు ప్రదర్శనకు తీసుకొచ్చారు. న్యాయ నిర్ణేతలు పెంపుడు జంతువుల జాతి.. జీవిత కాలం.. వాటి అలంకరణ.. వాటి నిర్వహణకు అయ్యే ఖర్చు తదితర వివరాలన్నీ యజమానుల నుంచి తెలుసుకొని ఉత్తమమైన వాటిని ఎంపిక చేశారు.. వాటి యజమానులకు యానం డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి బహుమతులు అందజేశారు.