ఆగని అంగన్వాడీల పోరు - సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరిక
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 20, 2023, 6:40 PM IST
Anganwadis Protest in Tirupati District : రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె తొమ్మిదో రోజు కొనసాగుతోంది. వినూత్న రితీలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు. హామీలను అమలు చేయాలని కోరుతూ నిరసన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని కార్యకర్తలు మండిపడ్డారు. దీనిపై తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఎం జగన్ ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ కంటే అదనంగా జీతాలు చెల్లిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కోరారు.
అదే విధంగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లిలో ఐసీడీఎస్(ICDS) కార్యాలయం వద్ద రోడ్డుపై పడుకొని విన్నూత నిరసన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు విరమించబోమని అంగన్‌వాడీలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ డిమాండ్ల సాధన కోసం అనంతపురం టవర్ క్లాక్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు అంగన్వాడీలు, వర్కర్లు, చిన్నారుల తల్లిదండ్రులు ర్యాలీ నిర్వహించారు. తొమ్మిదిరోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా సీఎం జగన్ మెుండి వైఖరి ప్రదర్శిస్తున్నారని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు.