ఎటువంటి హామీలు ఇచ్చేందుకు ప్రస్తుతం సీఎం జగన్ సిద్ధంగా లేరు: మంత్రి ధర్మాన - అంగన్వాడీల ఆందోళన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 31, 2023, 10:47 AM IST
Anganwadis Protest at Minister Dharmana House: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి హామీలు ఇచ్చేందుకు సిద్ధంగా లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడులో తన ఇంటిని ముట్టడించేందుకు వచ్చిన అంగన్వాడీలతో మాట్లాడిన ఆయన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మంత్రి మాటలకు సంతృప్తి చెందని అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినదించారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారంపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.
Anganwadi Workers Agitation in AP: ప్రభుత్వం నాలుగు దఫాలుగా చర్చలు జరిపినా తమ డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీలు కోరారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడం ఖాయమని అంగన్వాడీలు హెచ్చరించారు. కాగా అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్తూ మంత్రి ధర్మాన తన వ్యక్తిగత సిబ్బందితో ప్రస్తుతం సీఎం జగన్ ఎటువంటి హామీలు ఇచ్చే అవకాశం లేదన్నారు.