Anganwadi Workers Arrest: అంగన్వాడీల మహాధర్నా.. ఈడ్చుకెళ్లి వ్యాన్లో పడేసిన పోలీసులు - ఏపీలో అంగన్వాడీ కార్యకర్తల లేటెస్ట్ అప్డేట్స్
Anganwadi Workers Arrest: డిమాండ్ల సాధన కోసం 36 గంటలపాటు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన మహా ధర్నా రెండోరోజూ ఉద్రిక్తంగా కొనసాగింది. ఐసీడీఎస్ పరిరక్షణ, అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, కనీస వేతనం, పింఛను, గ్రాట్యూటీ అమలు చెయ్యాలని, ఇతర పెండింగ్ సమస్యలను కూడా పరిష్కారం చెయ్యాలని జులై 10న కోర్కెల దినం సందర్భంగా దేశవ్యాప్త పోరాటానికి అఖిల భారత కమిటీ పిలుపునిచ్చింది. ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని, మేనిఫెస్టోలో మహిళకు ప్రాధాన్యతనిస్తామని చెప్పిన సీఎం జగన్.. అంగన్వాడీలకు మాత్రం తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. తాము మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయలేదా అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు రూ.13,500 వేతనం పెంచి రెండేళ్లవుతున్నా.. ఇక్కడ మాత్రం ఆ ఊసే లేదని మండిపడ్డారు. పైగా అధికారంలోకి వచ్చి నాలుగేళ్లలో రూ.1,000 పెంచి సంక్షేమ పథకాలన్నీ తీసేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతోపాటు రూ.200 యూనిట్ల విద్యుత్తు రాయితీని ఎత్తేసి ఎస్సీ, ఎస్టీ అంగన్వాడీ మహిళల నుంచి బిల్లులు కట్టించుకుంటున్నారని మండిపడ్డారు. సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ ఎదురుగా పెద్ద ఎత్తున ధర్నాను ప్రారంభించిన అంగన్వాడీ కార్యకర్తలు రాత్రంతా టెంట్లు, నిరసన దీక్షా వేదిక వద్దే జాగారం చేశారు. ధర్నా చేస్తున్న నాయకులను పోలీసు అధికారులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యానుల్లో విసిరేశారు. నాయకుల అరెస్టు అనంతరం స్వచ్ఛందంగా మిగతా వర్కర్లంతా వ్యానులు, ఆటోలలో పోలీస్ స్టేషన్లకు తరలివెళ్లారు.