Pawan with Cheneta: ఒక్కసారి సీఎంను చేసి చూడండి.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా: పవన్
Pawan Kalyan meet with Chebrolu Cheneta: జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక.. చేబ్రోలును సిల్క్ సిటీగా మారుస్తానని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే రెండేళ్ల తర్వాత రాజీనామా చేస్తానని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారాహి యాత్రలో భాగంగా ఈరోజు ఆయన తూర్పుగోదావరి జిల్లా చేబ్రోలులో చేనేత కళాకారులు, పట్టు రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. నేతన్నల సమస్యలు జనసేన అధికారంలోకి వస్తేనే పరిష్కారమవుతాయన్నారు. జనసేన పార్టీకీ పదేళ్లు అధికారం ఇవ్వాలని ఆయన కోరారు. కేంద్రం చేనేతపై జీఎస్టీ తొలగించకపోతే.. అది రాష్ట్ర ప్రభుత్వం కట్టేలా చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానన్నారు. సీఎం జగన్.. నేత కార్మికులు, పట్టు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని గుర్తు చేశారు. తనను ఒక్కసారి ముఖ్యమంత్రిని చేసి చూడండి.. అభివృద్ది అంటే ఏమిటో చూపిస్తానని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తాను వస్తానంటేనే రైతులకు పరిహారం, రాయితీలు ఇస్తారా..? అంటూ పవన్ ఆగ్రహించారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు దిగిపొమ్మంటే దిగిపోతానని పవన్ కల్యాణ్ అన్నారు.