Andhra Pradesh Secretariat CPS Association: ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చినట్లు కథనాలు సరికాదు: సీపీఎస్ ఉద్యోగుల సంఘం
Andhra Pradesh Secretariat CPS Association: రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులకు జీపీఎస్ అమలు చేసి డిమాండ్లు నెరవేర్చినట్టుగా కొన్ని పత్రికలు కథనాలు రాయటాన్ని ఖండిస్తున్నామని ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం తెలియచేసింది. లక్షలాది సీపీఎస్ ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేరినట్టుగా రాయటాన్ని ఖండిస్తున్నామని పేర్కోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ సీఎం ఇచ్చిన ఓపీఎస్ పునరుద్ధరణ హామీకి ఇది పూర్తి విరుద్ధమని స్పష్టం చేసింది. జీపీఎస్‌పై ఆ పత్రిక ప్రచురించిన ప్రకటన 3.5 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులను అవమానపరిచిందని పేర్కోంది. లక్షల మంది ఉద్యోగులకు చెందిన అంశంలో హడావిడిగా ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకురావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది. ఈ అంశంపై చట్ట సభల్లో చర్చించకుండా, సీపీఎస్ ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకోకుండా ఎలా అమలు చేస్తారని ఏపీ సచివాలయ సీపీఎస్ ఆసోసియేషన్ వ్యాఖ్యానించింది.
జీపీఎస్‌కు సంబంధించిన విధివిధానాలు కూడా బహిర్గతం చేయకుండా అంత నిగూఢంగా దాన్ని ఆమోదించుకోవటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది. 2018 నుంచి సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలను ఇవాల్టి వరకూ చెల్లించకుండా తాత్సారం చేశారని ఆ సంఘం ఆక్షేపించింది. ఉద్యోగుల నెలవారీ జీతాల నుంచి మినహాయించుకున్న సీపీఎస్ కాంట్రిబ్యూషన్నూ ఉద్యోగుల పెన్షన్ ఖాతాలో జమ చేయలేదని ఆరోపించింది. ఇలాంటి తరుణంలో జీపీఎస్ ద్వారా పెన్షన్ గ్యారెంటీ ఇస్తామని ప్రభుత్వం చెప్పటం హాస్యాస్పదంగా ఉందని పేర్కొంది. ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ విధానాన్ని సీపీఎస్ ఉద్యోగులంతా తిరస్కరిస్తున్నారని స్పష్టం చేసింది. ఓపీఎస్ పునరుద్ధరణ మినహా మరే ప్రత్యామ్నాయం సీపీఎస్ ఉద్యోగులకు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.
TAGGED:
latest comments on cps