Actor Saptagiri about TDP: 'అతి త్వరలో శుభవార్త చెప్తా.. టీడీపీ బలోపేతానికి కృషి చేస్తా' - MOVIE ACTOR SAPTAGIRI comments
MOVIE ACTOR SAPTAGIRI ABOUT TDP: అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నానని.. ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ సప్తగిరి తెలిపారు. తనకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిందన్న సప్తగిరి.. సినిమా ఇండస్ట్రీలో ఏ విధంగానైతే పేరు సంపాదించానో.. టీడీపీ అధిష్ఠానం అవకాశం ఇస్తే రాజకీయాల్లోనూ అంతే పేరు సంపాదిస్తానని అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకి తెలియజేశారు.
10-15 రోజుల్లో శుభవార్త చెప్తా.. తిరుపతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో తెలుగు సినిమా నటుడు సప్తగిరి కీలక విషయాలను వెల్లడించారు. తనకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టమని.. ఆయన అవకాశం ఇస్తే.. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని సప్తగిరి వ్యాఖ్యానించారు. మరో పది నుంచి పదిహేను రోజుల్లో తిరుపతి జిల్లా ప్రజలకు శుభవార్త వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ.. ''త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, యువనేత లోకేశ్ ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. అందరి అభిమానంతో ఇంతటి స్థాయికి ఎదిగాను. చంద్రబాబు, లోకేశ్, పార్టీ పెద్దలు ఆశీర్వదిస్తే.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధంగా ఉన్నాను. టీడీపీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తాను. తెలుగుదేశం పార్టీ అంటే నాకెంతో ఇష్టం. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంతో బాగుంటుంది. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో ఓ పేద కుటుంబంలో పుట్టి.. పుంగనూరులో చదువుకున్నాను. ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో అందరి అభిమానాలతో ఓ చిన్న క్యారెక్టర్ నుంచి ఇంత పెద్ద హీరో, కమెడియన్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాను. అవకాశం వస్తే సినీ ఇండస్ట్రీలో క్రమశిక్షణతో ఎలా పేరు సంపాదించుకున్నానో.. అదేవిధంగా రాజకీయాల్లోనూ నిజాయితీ, నిబద్ధతతో పని చేస్తాను'' అని ఆయన అన్నారు.