Pastors Federation క్రైస్తవ సంస్థల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి: జీవన్ కుమార్ - Lutheran Church Properties
Pastors Federation: క్రైస్తవ సంస్థల ఆస్తులను కాపాడటంలో వివక్షతను చూపిస్తున్న పరిస్థితి కనపడుతుందని ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జీవన్ కుమార్ అన్నారు. విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. క్రైస్తవ సంస్థ ఆస్తులు, మిషనరీలు, క్రైస్తవ సమాధి క్షేమాభివృద్ధి, సామాజిక అభివృద్ధి కోసం పాస్టర్లు ఎన్నో సేవలు అందించారన్నారు. క్రైస్తవ సంస్థల ఆస్తుల విలువ వెలకట్టలేనివిగా మారిపోవడంతో.. వాటిని విక్రయించేందుకు కొంత మంది చూస్తున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లాలోని లూథరన్ చర్చి ఆస్తులు ఎంతో విలువైనవని.. వేల కోట్లు ఖరీదు చేసే ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతున్నాయన్నారు.
క్రైస్తవ ఆస్తులను కాపాడాలని ఎన్ని సార్లు విన్నవించినా ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి స్పందన లేదన్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఆంధ్ర బాప్టిస్టు సంస్థల ఆస్తులు కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయన్నారు. ఇవే కాకుండా రాష్ట్రంలో అనేక చోట్ల ఇదే విధంగా ఆక్రమణలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం చొరవ తీసుకుని అన్యాక్రాంతం అయిపోతున్న క్రైస్తవ ఆస్తులను కాపాడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నామన్నారు.